Saturday, March 17, 2018

అమ్మ పవనా...!

అస్సలనుకోలా, ఇట్లా అవినీతిపైన శంఖం పూరిస్తావని..!




నీ పంచ్ డైలాగులు లేవుగాని ఎమోషన్ ఏమాత్రం తగ్గకుండా మాట్లాడినావు అబ్బాయా.. నాలుగో వార్షికోత్సవం అనగానే కొంత నవ్వులూ పువ్వులూ వుంటాయనుకున్నాము గానీ, నువ్వు ఒకటే సీరియస్ బా. నోరు తెరిసినప్పుడు నుండీ దూకుడే అనుకో..

తెల్ల స్క్రీన్ ముందర నల్ల జుబ్బా వేస్కొని ఉన్నావు కాబట్టి కాస్త మసగ్గా కనిపించావు కానీ, గడ్డం గీసేసి ధగధగా మెరిసిపోయినావు అనుకో. చక్కగా మాట్లాడినావు. నీ ఆక్రోశం ఏమాత్రం తగ్గలా.  ఎన్నెన్ని విషయాలు మాట్లాడినవో ఎంతెంత లోతుగా చెప్పినావో చూస్తే, నిజంగానే నీకు ఇన్ని విషయాలు తెలుసా అని అడిగేవాళ్ళ నోరు మూయించినావనుకో.

మొదటిసారిగా లోకేషు బాబును వాయించేసినావె.  అవినీతి గురించి మాట్లాడతావని ఎదురుచూస్తున్నాము గాని నేరుగా చిన్నబ్బాయిని టార్గెట్ చేసేసినావె. ఎవురూ లేపోతే  ఏ కౌన్సిలరునో, మహా అయితే  ఎమ్మెల్యేనో, ఇంకా పోతే ఏ ఎంపీనో ఏకేస్తావని అనుకుంటుంటే అదేదో కుంభస్థలం అంటారే, అట్లా సియం కొడుకు పైన అస్త్రం ఎక్కుపెట్టినావు. కాని అవి అందరూ అంటున్న వింటున్న అనుకొంటున్న పుకార్లే కానీ బలమైన ఆధారాలతో చెప్పుంటే బాగా ఉండేది. 

అట్లా తెలుగు దేశాన్ని తెగేదాకా తిట్నావు, బాబుగారిని బండగా తిట్నావు, లోకేషును లోతుగా తిట్నావు, జగన్ని జడుసుకునేలాగా తిట్టినావు, కేంద్రాన్ని ఇంగిలీషులో తిట్నావు...   కానీ, ఏంబా అంత దూరం లాగేసినావు? తెంపేసుకుందామనేనా? నువ్వు లాగతా ఉన్నప్పుడే అర్థమయింది ఇది తెంపడానికే అని. వామపక్షాలని వొదిలినావుయోవ్.  ఈ లెక్కన చూస్తే కామ్రేడ్స్ ఇంక జెపితో మాత్రమే దోస్తీనా? ఒకటి మాత్రం అర్థంకాలేదు. ప్రజలకోసం కలిసిమెలిసి ఉండి, అవినీతి అసమర్థ పాలనను నాలుగేళ్లు ఓర్చుకొని సహనం కోల్పోయి ఇప్పుడు తిట్టినాను అంటున్నావు గాని, బయటి నుంచి, అంటే ప్రజలవైపు నుంచి  చూస్తే, మీరంతా 2014 నుండి ఒక్కటే కదా. నువ్వు చెప్పిన అవినీతి అసమర్థత నీకు కూడా వర్తిస్తుందిబా.. 



దూకుడుగా అరుపులు, అనవసరమైన చోట కులాల ప్రస్తావన, ముందు వెనుక విషయాలను ఓ కూర్పు లేకుండా మాట్లాడటం వంటివి వదిలేస్తే, నీ ప్రసంగం బేషుగ్గా సాగింది. కుర్రాళ్ళ రెస్పాన్స్ కూడా అదుర్స్ అన్నట్లు ఉంది. నువ్వు ఒప్పుకున్నా లేకున్నా పవన్ ఓటు బ్యాంకు వీళ్ళేకదా.. 

ఈ వేడి తగ్గనీకుండా ఇక్కడే ఉండి ప్రజల సమక్షంలో సమస్యల్ని చూస్తే నిన్ను సీరియస్గా  తీసుకుంటారు. హైదరాబాద్ కి వెళ్ళిపోయి నెల తర్వాత వస్తే మర్చిపోతారు.   అయినా ఇల్లు కట్టుకుంటున్నావు కదా, అది పూర్తయ్యే దాక గుంటూరు వదిలి యాడికి పోతావులే...!

Sunday, July 24, 2016

నాకు నేనే..!


 











హలాలు పట్టి పొలాలు దున్నలేము కానీ ఫలాల కోసం నోరు తెరుస్తాం 
కాలికి బురద అంటుకోనీయం కానీ చేతికి అన్నం ముద్ద కావాలంటాం 
తాత ముత్తాతలు పండించిన బియ్యపు రకాలు తెలియవు, బాస్మతి ఉంటే చాలంటాం 
గోమాత సేవ చేయం కానీ కాఫీకి చిక్కటి పాలు కావాలంటాం 

మలగోవా కాదరు బేనిషా తీపి నేనెరుగ, మాజ ఫ్రూటీ స్లైస్ తాగుతాం గా..!
కంది ఉలవ ఉద్ది శెనగ నేనెరుగ, దాల్ మఖని  మెనూ కార్డులో ఉందిగా..!! 
గోవు పొదుగు ముట్టి ఎరుగను, పాలెక్కణ్ణుంచి వస్తుందంటే కవర్లోంచి అంటాం 
కాలువేత్తే వాణ్ణి విస్మరిస్తాం, కళకళలాడే వాతావరణం కావాలంటాం 

మామిడికి పట్టే చీడ గురించి నాకేల, ప్రియా ఆవకాయ తెప్పిస్తే పోలా?
మత్స్యకారుల బతుకు పోరాటం మాకేల, ఫిష్ ఫ్రై ఓ ప్లేటు ఆర్డర్ ఇస్తే పోలా ?
కోళ్లు గొర్రెలు మేపడం మా తరం కాదు, KFCలో ఆర్డర్ ఇచ్చే తరం మాది 
పందులు మేపేవాడు ఎవడో తెలియదు, కానీ పొర్కును ఫోర్కుతో తినే తరం మాది  

పత్తి రైతు వ్యధ ఎరుగం కానీ కాటన్ చొక్కా ముడతలు పడనీయం 
పట్టు పురుగు శ్రమ ఎరుగం కానీ పోచంపల్లి బనారస్లు వదులుకోమ్
నేత కార్మికుడి మగ్గం చూసిందెవరు, చందన బొమ్మన గుమ్మమెక్కుతుంటే 
దర్జీ కుట్టు మిషను చక్రాన్ని చూడలేదు, దర్జాగా రెడీమేడ్ వేస్కుంటుంటే 

శిల్పి ఉలి శబ్దం ఎరుగం కానీ నా పోర్టికోకు అందమైన శిల్పం కావాలి 
రంగుల కుంచె ముట్టింది లేదు కానీ నా పోర్ట్రయిట్ డ్రాయింగ్ రూంలో ఉండాలి 
వడ్రంగి పనితనం నేనెరుగ, డబుల్ కాట్ బెడ్ దంరో లో కొంటాగా 
స్వర్ణకారుల నేర్పరితనం నేనెరుగ, తెలిసిందల్లా ఖజానా కళ్యాణ్ GRT ధగధగ 

ఇలా ఎన్నో ఎన్నెన్నో ఉంది ఉదాహరణలు, ఎవరో ఎవరెవరో ఉన్నారు మన జీవనగమనంలో 
మనమెవ్వరినీ పరికించం, పలకరించం, పరిశీలించం, పరీక్షగా చూడం. 
ఈ ప్రపంచంలో కోట్లాది మందిలో ఒకరికి ఒకరం పరాయివాళ్ళం 
ఈ జన సంద్రంలో మనమందరం ఒంటరివాళ్ళం 

మన చుట్టూ ఉన్న సమాజంలో మనకెవ్వరూ అక్కర్లేదు 
ఒకరిపై ఒకరు ఆధారపడి బతుకుతున్నాం అన్న భావన అస్సల్లేదు 
అందరిలో నేనే గొప్ప అనే భావన కలగడం చాలా సులభం 
కానీ ఆధారపడనిదే బతుకు బండి నడవడం దుర్లభం 

రండి, ఒకరినొకరు పలకరిద్దాం, నీ మనుగడకు సాయపడే ప్రతి ఒక్కర్నీ కలవరిద్దాం 
ఆజన్మాంతం సహాయపడే వారికి ఋణపడి ఉందాం, అదే నోటితో మనసారా ధన్యవాదములు తెలుపుదాం 
జగమంత కుటుంబం మనది అని చాటు రా 
అది ఏకాకి జీవితం కాకూడదు రా...!

Saturday, October 31, 2015

మౌనమేలనోయి...!

మౌనం అర్ధాంగీకారం
జరిగే పరిణామాలకు కొన్నిటికి ఆమోదం, కొన్నిటికి వ్యతిరేకం

మౌనం సమ్మతం
ఇలా జరగాల్సిందే, తగిన శాస్తి జరిగింది

మౌనం సహన స్వీకారం
స్పందించక ముందు ఇంకాస్త ఓపిగ్గా చూద్దాం

మౌనం నిర్వేద సూచన
ఎక్కడో ఏదో జరిగితే నేనెందుకు స్పందించాలి?

మౌనం దుఃఖ సంకేతం
ఇలా ఎందుకు జరుగుతోంది? బాధగా ఉంది!

మౌనం అచేతన రూపం
ప్చ్.. ఇలా జరగాల్సింది కాదు

మౌనం ఆగ్రహసహితం
ఇలాంటి వారిని సహించను, ఉతికారేయాలి

మౌనం కవ్వింపుకు శ్రీకారం
ఇలాగే ఉందాం. ఎవరెలా స్పందిస్తారో వేచి చూద్దాం..!

మౌనం స్థితప్రజ్ఞతకు ఆధారం
ఏదెలా జరిగినా మన మంచికే. నేను కారకుణ్ణి కాను, భాద్యుణ్ణి కాను

ఇదండీ... ఈయన మౌనాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. సిరా పోయడం, చేయి చేసుకోవడం, కర్రలతో బాదడం, ఎవరేమి తినాలో శాసించడం, ఇక డౌన్ డౌన్ల సంగతి చెప్పనవసరం లేదు... ఎందుకిలా జరుగుతోంది? స్పందన ఎందుకు కరువవుతోంది. ఇదేమి బాగాలేదని ఎవరన్నా ఆయనకి చెప్పరూ?? ఇంతకీ ఆయన ఎవరంటారా?

ఓం 'నమో' వేంకటేశాయ..!


Saturday, October 17, 2015

అమరావతి కి వందనాలు

ఏంది యోవ్!!  మొత్తం మీద రాజధానికి సిద్ధం అవతా ఉండారు అంతా.  మనోళ్ళు కూడా సంబరాలు చేసుకుంటా ఉండారు కుండలో నీళ్ళు పట్టుకుని, గోతాంలో మట్టి పోసుకొని. ఓ రెండ్రోజుల్లో మోడీ గారు వచ్చి పలక నాటి పోతే ఓ పదేళ్ళలో ఓ కొలిక్కి రావచ్చేమో కదా...!

యాడో మాగొప్ప రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ని దివాలాకోరు దిశగా తోసింది విభజన.  అన్నం పెట్టె చెయ్యిని  అడక్కతినే పరిస్థితికి తెచ్చిండ్లా. మడికాడ పక్క కయ్యి వాడు నీళ్లు ఇమ్మంటేనే కసురుకునే రోజులు, ఇంకా పక్క రాష్ట్రం వాడు ఇస్తాడా? ఏంటికి ఇస్తాడు? ముందే మనకు కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళతో పేచి ఉండాది, ఇప్పుడు ఎగదాల ఇంకో కొత్త రాష్ట్రం వచ్చింది కదా. ఇంకా అంతే సంగతులు... 

ఇంక వసతులు అంటారా, ఒక్కోటి తెచ్చుకోడానికి నానా పాట్లు పడాలి. యాభై ఏళ్ళలో తెచ్చుకున్నదంతా హైదరాబాద్ లో పెట్టించి ఎద్దులో లాభం యాడో పోయినట్లు అయింది. మళ్ళీ బొచ్చె పట్టుకొని బొచ్చు సర్దుకొని ఎలబారినారు మన రాజకీయ నాయకులు. ఏదో తెస్తారని మాత్రం అంతా బాగానే అనుకుంటా ఉండారులే. అదేదో హోదా అంట కదా... అది వస్తుందని, రాదని, రావొచ్చని, రాకపోయినా నష్టం లేదని, వస్తేనే అన్నీ అవుతుందని కాదని, ఇలా రకరకాలుగా అంతా మాట్లాడతా ఉంటె, పైనుండే పెద్ద గడ్డం ఆయన, అదేబా మోడీ గారు, నోరే తెరవడు. ఈయనేందో మన్మోహన్ సింగే  మేలు అన్నట్లుగా ఉండాదే..!

అంతా బాగానే ఉంది కాని, రాజధాని విశేషాల్ని సీమోళ్ళు మాత్రం బెరుగ్గానే చూస్తా ఉండారు. అదొస్తుంది ఇదొస్తుంది అని బాగానే ఊదరగొడతా ఉంటె వచ్చేదేందో  పోయ్యేదేందో  తెలియట్లేదు.  అమరావతి జపం కూసంత ఎక్కువైనట్లే ఉన్నా మళ్ళీ ఈ గలాటలు మొదటికే వస్తుందేమో, చూసుకోండి నాయుడు గారు...!

Saturday, August 23, 2014

విదూషక శిఖామణి..!


బఫూన్ అనే ఒక చిన్న పదం పెద్ద రాజకీయ దుమారం రేపింది. ఎందుకలాగా? 


బఫూన్ అనే స్థాయిలో ప్రభుత్వ పక్షం నడుచుకొందా? లేక బఫూన్ అని తిట్టెంత స్థాయిలో ప్రతిపక్షం ఉందా? ఇంతకీ బఫూన్ అంటే బూతా? కాదంటారు జగన్, అయినా క్షమాపణకు పట్టుబడుతోంది పాలకపక్షమ్.

బఫూన్ అంటే ప్రజలను నవ్వించే విదూషకుడు అని, ఆ మాట చెప్పిన వారే సెలవిచ్చారు. విదూషకుడు అంటే తిట్టా? కాదే. ఓ రకంగా ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తూ, వినోదాన్ని పంచుతూ వారి బాధలనుండి విముక్తి కల్గించే వాడు విదూషకుడు. సమస్యల నడుమ కొట్టుమిట్టాడుతూ ఆశల హరివిల్లు ఎక్కలేక, దరిద్రంతో దోబూచులాడుతున్న ఆమ్ ఆద్మీ కి విదూషకుడు ఓ గొప్ప నేస్తం. త్రిశంకు స్వర్గంలో ఉన్నామన్న భావనను మరిపించి, నిజమైన స్వర్గాన్ని దగ్గరలో చూపించే ఓ అద్దం.  నవ్వించి, ఆడించి, కేరింతలు కొట్టించి సామాన్య ప్రజల రోదిస్తున్న గుండెల్ని సైతం తేలేటట్టు చేసే ఓ మాయలోడు. నిజమైన చేదు వార్తను తీపి కోటింగ్ ఇచ్చి మనలో ఎక్కించే MBBS లేని వైద్యుడు.

మరి ఇంత మంచి వ్యక్తిని బూతుగా మార్చేసినారేంది సామీ. రాజకీయుల తిట్లకు వేరే పేర్లు దొరకలేదా? ఓ సినిమాలో ఓ స్వామీజీ ఆశీర్వాదం చేస్తే వాడు నాశనమై పోతాడు అని ప్రజల భయం. తను తిడితే బావుంటాడు అని నమ్మకం. అందరూ అడిగిమరీ తిట్టించుకుంటారు ఆ సామి దగ్గర. అలాంటి పరిస్థితే ఇక్కడ.

కాని, జగన్ను మెచ్చుకోవాలి. మంత్రులపై ఎంత కొపమున్నా ఓ మంచి పదంతో తిట్టాడు. (తిట్టినట్లు అనుకుంటున్నాడు). ఇదే అవకాశంగా పాలకపక్షం కూడా ఎగిరి గంతులేస్తున్నారు.  ఈ అద్భుత అవకాశం అందిపుచ్చుకున్నందుకు జగన్ కు 'విదూషక శిఖామణి' లాంటి బిరుదు ఇవ్వాలి...! 

Friday, January 17, 2014

నేనొక్కడినే... కాను!





'1.. నేనొక్కడినే' సినిమా చూడకముందు పేస్ బుక్  లో ఓ కామెంట్ చూసా . ' ఈ సినిమా చదువుకున్న వారికి మాత్రమే అర్థం అవుతుంది' అని. దానికి ప్రతి కామెంట్ ఏమంటే: 'అంటే మహేష్ సినిమా చూడాలంటే డిగ్రీ చేసి రావాలా?'

నవ్వుకోడానికి బాగానే ఉంది కాని, ఈ కామెంట్ నిజ్జంగానే విలువైనధి. తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా ఇధి. ఎదుగుతున్న సాంకేతిక విలువలకు అద్దం పడుతున్న సినిమా. హాలీవుడ్ అంటే పెద్ద సీన్ కాదని, మనం చెయ్యగలిగే స్థాయేనని నిరూపించారు డైరెక్టర్ సుకుమార్.

ఒక సైకలాజికల్ థ్రిల్లర్ తీయాలని అనుకున్నప్పుడు, ఆ సూపర్ స్టార్ యొక్క అభిమానుల గురించి, అతని చుట్టూ ఉన్న ఇమేజ్ అనే వలయం గురించి మామూలుగా అందరూ ఆలోచిస్తారు. సుకుమార్ కాని, మహేష్ కాని, ఇలాంటి చిన్న చిన్న విషయాలను దాటి ఆలోచించగలిగారంటే అది మన టాలివుడ్ కి శుభ పరిమాణం.

ఇక సినిమాకి వస్తే, ఓ వ్యక్తి ఊహా జనిత ఆలోచనలకు, అతని మానసిక అవస్థలకు అద్దం పట్టే కథ. తన తల్లి తండ్రులను ఎవరో చంపేశారని బలంగా నమ్మే వ్యక్తి వారిని చంపాలనుకుంటాడు. పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. ముక్కూ మొహం తెలియని వారిని గుర్తించడం ఎలా, చంపడం ఎలా?  తను ఊహించుకుంటున్న విషయం నిజమా, అబద్ధమా అని కూడా పదే పదే అడిగి తెలుసుకునేంత కన్ఫ్యూస్ అయిన వ్యక్తి మన హీరో. తను అబద్ధం అని రాజి పడి సర్దుకునే సమయంలో తన గతానికి సంబంధించిన విషయాలు నిజాలుగా తేలుతాయి. తన గతం గురించి తెలుసుకునే ప్రయత్నం ముమ్మరం చేస్తాడు. గోవా వెళ్తాడు, ఐర్లాండ్ పోతాడు, విల్లన్లను పట్టుకుని చంపేస్తాడు. తల్లితండ్రుల గురించి తెలుసుకుని, వాళ్ళ ఆశయాలను కాపాడుతాడు. కథ ఎంత క్లిష్టమైనదో, కథనం అంత వైవిధ్యం. నగిషీలు దిద్ది దర్శకులు తీర్చి దిద్దిన విధం అద్భుతం.

ఒక్కటే విషయం. చందమామ కథల నుండి, యక్ష ప్రశ్నల వరకు, అన్నిట్నీ అందరికీ అర్థం అయ్యే విధంగా ఒకే సారి చెప్పడం చాల కష్టం. ఒక్కొక్కరి గ్రాహక శక్తీ ఒక్కో విధంగా ఉంటుంది. మరి సుకుమార్ ప్రయత్నం ఓ మేధావి వర్గాన్ని మాత్రమే ఆకట్టుకోవడానికే అనుకుంటే ఎలా? డివైడెడ్ టాక్ నుంచి బావుంది అనే మాట రావడానికి కేవలం రెండు రోజులే పట్టింది. సో, సినిమా నచ్చింది అని చెప్పేవాడిని నేనొక్కడినే కానేమో?  మొత్తానికి, ఈ సినిమా అర్థం కాలేదంటే నేను మేధావిని కానేమో అని ప్రేక్షకులు భయపడైనా ఒప్పెసుకునేట్టు ఉంది..!

సుకుమార్ కి, మహేష్ కి మాత్రమే కాక, నిర్మాతలకు కూడా ఈ కీర్తిలో భాగం ఉంది. ధైర్యం ప్రదర్శించి నిర్మాతలు కూడా శభాష్ అనిపించుకొన్నారు.  'తెలుగులో మంచి సినిమాలు రావు' అని పొరుగు రాష్ట్రాలను కీర్తిస్తూ మనోళ్ళను దెప్పిపొడిచే ఓ సామాన్య ప్రేక్షకుడా, దృక్పధం మార్చుకొని మరోసారి సినిమా చూడు.


మూసలను పగులకొడదాం. కొత్త ప్రయత్నాన్ని స్వాగతిద్దాం..! 

Tuesday, April 16, 2013

రవాణా రాష్ట్రం... రావణ కాష్టం...!


రవాణా రాష్ట్రం... రావణ కాష్టం...!

వేగం పుంజుకున్నది, మార్గం సుగమమైనది, రాష్ట్రంలో అందరూ ఏదో ఒక బాట పట్టారు.

ధర్మం ఎన్ని కాళ్ళపై నడుస్తుందో కాని, ప్రతి ఒక్కరు ఎక్కడో నడుస్తూనే ఉన్నారు. మండుటెండలు రోడ్డు పైనున్న తారును కరిగిస్తుంటే, మాయదారి మాటలతో మన నాయకులు రోడ్డెక్కి ప్రజల మనసులను కరిగించే పనిలో పడ్డారు. 




'మీకోసమే' అంటూ బాబన్న పాదయాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయి దాటింది. చెల్లెమ్మ నడక ఊరూరా సాగి, రాజన్న రాజ్యాన్ని కాంక్షిస్తున్నది. కిరణ్ బాబు 'ఇందిరమ్మ కలలను' సాకారం చేయడానికి ప్రతి జిల్లాలోనూ మారుమూల దళితవాడను ఎంచుకొని పరుగులు సాగిస్తున్నాడు. తెలంగాణా రాష్ట్ర సమితి వారు బస్సు యాత్ర చేపట్టాలనుకుంటే, ఆ ప్రాంతానికే చెందిన కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కారు ఎక్కేదానికి సిద్ధపడ్డారు.  కమ్యునిస్టులు, పరివార్ మిత్రులు అరుదుగా కలిసి ప్రభుత్వాన్ని కలిసి వ్యతిరేకిస్తున్నారు, విద్యుత్ చార్జీల విషయమై రోడ్డెక్కారు.










ఏది ఏమైనా, విస్మయం కలిగే రీతిలో అన్ని పార్టీల నాయకులు చంచల్ గూడ దారి పట్టారు, తృణమో పణమో 'జన నాయకునికి' ముట్ట చెప్పడానికి, గుట్టు చప్పుడు కాకుండా రవాణా చేస్తూ.




నడక మంచిదని ప్రతి ఒక్కరూ అంటారు. డాక్టర్లు సలహా ఇచ్చేది కూడా ఇదే. ఇదేమి గోలో కాని, అందరు నాయకుల డాక్టర్లు ఒక్కసారిగా ఇలా సలహా పడేసినట్లున్నారు. అంతా నడక మయం.  కాని ఇంట్లో గడవక, లైట్లు మండక, చేలో మోటర్లు నడవక, నింగినంటిన ధరలకు నిత్యావసర వస్తువులు కొనలేక, పిల్లలను చదివించుకోలేక సామాన్యుడు మాత్రం ఎటూపాలుపోక దిక్కు తోచని స్థితిలో నడుస్తూనే ఉన్నాడు. చావును వెతుక్కుంటూ. కాని ఈ నడక మన మాధ్యమాలకు అవసరం లేని నడక. అందుకే ఇది ఏ పేపర్లోనూ, ఏ చానేల్లోను కనపడదు.

'నడుస్తున్నది' రవాణా రాష్ట్రమా, లేక రావణ కాష్టమా?

Friday, April 20, 2012

సీమలో కిరణ్, జగన్ పరిస్థితేంటి?




2009 తర్వాత అటు తెలంగాణా పై అనిశ్చితి, ఇటు జగన్ వేగానికి కళ్ళెం వేయలేకపోవడం, రెండూ చేరి కాంగ్రెస్ ప్రభుత్వం పీకల్లోతు సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. వైఎస్సార్ మరణానంతర అనిశ్చితి తొలగడానికి ఓ పెద్ద మనిషిగా కొణిజేటి రోశయ్యను ముఖ్య మంత్రిగా చేసినా, అది పరిస్థుతులు సర్దుకొనేంతవరకే అవసరమైంది. ఆ "జంట అలజళ్ళను" తట్టుకోడానికి రోశయ్య చేసింది పెద్దగా ఏమి లేదు. ఆయన "అంతటి శూరుడు" అని తనూ కలగన లేదు, అధిష్టాననికీ అంత అభిప్రాయం లేదు. అప్పటి పరిస్తుతుల్లో నాన్చివేత ఒక్కటే సరైన మార్గంగా కాంగ్రెస్ ఎన్నుకొంది. కాని, తర్వాతి రోజుల్లో, పార్టీని 2014 ఎన్నికలకు సిద్ధం చేయడానికి ఒక బలమైన నాయకుడు అవసరం అనీ, అతను తెలంగాణకు, జగన్ కు కలిపి చెక్ పెట్టేవాడిగా ఉండాలని అనుకొంది. తెలంగాణా, సీమ ప్రాంతాల్లో విజయాన్నినిర్దేశించగల ధనబలం, కండబలం ఇంక సంఖ్యాబలం గల సామాజిక వర్గం రెడ్లే. అందులోను ఒక యువ నాయకుడిని తీసుకుంటే, అటు తెలంగాణా రెడ్లను ఉద్యమం నుంచి దూరం చేయొచ్చు, ఇటు సీమలో జగన్ వైపు మొగ్గుతున్న రెడ్లను పార్టీ వైపు తిప్పుకోవచ్చు, అనే 'రెండు వైపులా పదునైన కత్తిగా' నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని హై కమాండ్ ఎంచుకొంది. కాని ఆ పాచిక పారలేదు.


సొంత పార్టీ వారే కిరణ్ పై అపనమ్మకం పెంచుకోనేటట్లు కిరణ్ వ్యవహార శైలి తయారైంది. ఎప్పుడూ తనకంటూ ఓ వర్గం లేని కిరణ్, ఎవ్వరిని దగ్గర చేర్చిన పాపాన పోని కిరణ్, ఇప్పుడు ముఖ్య మంత్రిగా 'అందరివాడు'గా ఉండాల్సినప్పుడు, ఎవ్వరికీ 'చెందనివాడు'గా తయారయ్యాడు. హైదరాబాద్ నుండి తన పీలేరు నియోజకవర్గంలోని సొంతూరు నగరిపల్లెకు వెళ్ళాలన్న కూడా, తిరుపతికి విమానంలో వచ్చి, పదిమందిని పలకరించి అక్కడనుండి పీలేరు వెళ్ళడు. హైదరాబాద్ నుండి నేరుగా బెంగళూరుకు విమానం పట్టుకొని, అటునుంచి మదనపల్లె మీదుగా పీలేరుకు వస్తాడు. తన సొంత జిల్లాలో కూడా ఆయనకు పట్టులేకపోవడానికి అదే కారణం. వై.ఎస్.ఆర్ నీడన పెరిగిన ఆయన ఇంత ఎత్తుకు ఎదుగుతామని, తనకంటూ ఓ వర్గం అవసరం అవుతుందనీ బహుసా అనుకోలేదేమో!

సీమలో, ప్రత్యేకించి కడప జిల్లాలో, రెడ్డి సామాజిక వర్గం ఇన్నేళ్ళు కాంగ్రెస్ కు వత్తాసు పలికినా, ఇప్పుడు ఎకతాటిపైన జగన్ కే మద్దతు పలికే అవకాశం మెండుగ ఉంది. కిరణ్ వెర్సస్ జగన్ అన్న పరిస్థితి వస్తే: ఇద్దరూ రెడ్లే, ఇద్దరూ దాదాపుగా యువకులే. జగన్ పెద్దాయన ఆస్తికి వారసుడైతే, కిరణ్ వై.ఎస్.ఆర్ దగ్గర రాజకీయ ఓనమాలు దిద్ధినవారు. ఇంకా చెప్పాలంటే వై.ఎస్.ఆర్ కిరణ్ తండ్రి నల్లారి అమరనాథ రెడ్డికే సన్నిహితుడు. మరి ఈ సామాజిక విభజన ఎందుకు? ఈ వర్గానికి కాంగ్రెస్ ఏమి తక్కువ చేసిందని ఈ అలక? లేదా, జగన్ ఏమి చేస్తాడని వారి ఆశ, ఎదురుచూపు? ఇంకా చెప్పాలంటే, వై.ఎస్.ఆర్ తమ వర్గానికి చెసిన "మేలుకు" ప్రతిఫలంగా ఆయన ఋణం తీర్చుకోడానికి జగన్ కు వోటు వేయొచ్చు.


మరో వైపు ఓదార్పు పేరుతో జనం మధ్యన తిరుగుతున్న జగన్ కు అంతటా గుర్తింపు పెరుగుతోంది. అతని పైనున్న అవినీతి ఆరోపణలను నిరూపించి ముద్దాయిగా ప్రజల ముందు నిలిపే అవకాశమున్నా కాంగ్రెస్ తాత్సారంతో విఫలమయింది. దానితో "తనను వేదిస్తున్నారనే" జగన్ వాదనే నెగ్గే పరిస్థితి ఉంది.

ఈ సమస్యకు మరో పార్శ్వం ఏమంటే: పార్టీలో కోవర్టులు ఉన్నారని కొందరంటే, అది సిఎంకి కూడా వర్తిస్తుందని ఇంకొందరు గుసగుసలాడుకొంటున్నారు. జగన్ పై పల్లెత్తు మాట మాట్లాడని వైనం, తమను, తమ పార్టీని అనునిత్యం 'ఎక్కిదిగే' సాక్షి దినపత్రికకు వంద కోట్లకు పైగా ప్రకటనలు ఇవ్వడం వెనుక మతలబు కూడా ఇదేనేమో? తెర వెనుక నడుస్తున్న బాగోతం ఏమిటి? కిరణ్ లో నాయకత్వ లక్షణాలు లేవా, లేక ఆయన అది ప్రదర్శించ లేక పోతున్నారా? ఏది నిజం? పైపైకి హై కమాండ్ ను మచ్చిక చేసుకున్నా, లోలోపల జగన్ కు మేలు చేస్తున్నారా? కాంగ్రేస్ లో ఇతర కులాలకు చెందిన సీనియర్లు కుమిలిపోతున్నారు. నల్గొండలో ఈమధ్య డీసిసి అధ్యక్షుడు అన్నట్లు ఎవరు మనవారో, ఎవరు ద్రోహులో అర్థం కాని పరిస్థితి ఉంది కాంగ్రెస్ లో. అది రాయలసీమకు కూడా వర్తిస్తుంది.

ఉప ఎన్నికలలో ఎవరిది వాపో ఎవరిది బలుపో తేలిపోతుంది!

Sunday, March 20, 2011

ఉన్మాదానికి మూగ సాక్షులు

ఉన్మాదానికి మూగ సాక్షులు



 


ట్యాంకు బండపై గంభీరంగా నిలిచి, హైదరాబాద్ నగరానికి తెలుగు కళను తెచ్చిన మహామహుల విగ్రహావళి. వాటికి మనం ఈ మధ్య అర్పించిన నివాళి ఎంతో ఘనం. మన గతాన్ని గౌరవించలేదు, భవిష్యత్తుకూ మంచి సందేశం ఇవ్వలేదు. మన సాంస్కృతిక పురోగామనానికే తిరోగమనం ఆ దుర్దినం.



అవి పలుకలేని మూగ విగ్రహాలే కావచ్చు. కాని వారికి తెలంగాణను మించిన చరిత్ర ఉంది. ఆ శిలలు  ప్రాంతీయతలను మించిన స్ఫూర్తి అందిస్తాయి. తిక్కన, నన్నయ, ఎర్రాప్రగడలకు తెలుగు తెలుసు, తెలుగు ప్రజలు తెలుసు, కాని తెలుగు మాట్లాడే ప్రాంతాలలో ఉప ప్రాంతాలు తెలియవు. అంటే ఏ కారణంతో వారి విగ్రహాలు కూల్చారో కూడా తెలియని స్థితిలో వారు కూలి ఉన్నారు. కొందరైతే హుస్సేన్ సాగర్ లో మునిగి ఈ ఉన్మాదం వెనుక గల కారణాలను ఆలోచిస్తుంటారేమో? వీరిని ముంచితే తెలంగాణా ఎలా వస్తుందో కూడా వారికి అంతుపట్టదు.





కాని, తెలంగాణా ప్రాంతంలో కూడా నిస్పక్షపాతంగా ఆలోచించే సాహితీ వేత్తలు, మేధావులు ఉన్నారు. వారు లోలోపల ఈ దుశ్చర్యలపై కుళ్లుకున్నా బయట చెప్పడానికి సాహసించడం లేదు. ఇది పరోక్షంగా ఇలాంటి వారికి మద్దతు పలకడమే అవుతుంది. ఇదే బయటపడే సమయం. ప్రాంతాలకతీతంగా తెలుగు మన అందరి సొత్తు. భాష, సంప్రదాయం, సంస్కృతి మనందరికీ సొంతం. వాటిని పరిరక్షించడంలో ఈ ఘనకీర్తులు పోషించిన పాత్ర గణనీయం. దాన్ని ప్రతి ఒక్కరూ ఆమోదిస్తారు. యాసలు, అలవాట్లు మారొచ్చు. అంత మాత్రానికే ఆ పెద్దలు వారసత్వంగా ఇచ్చిన మన సంస్కృతిని మరచి వారి విగ్రహాలనే కూలగొడితే తల్లినే నరికిన అంత పని కాదా?

ఇంకో పక్క, సంగారెడ్డిలో తెలంగాణా తల్లి విగ్రహాన్ని కూల్చి తెలంగాణా వాదులే ఇలాంటి అగ్గికి ఆజ్యం పోసారు. . వాళ్ళ జిల్లా మంత్రితో  ఉన్న  సమస్యను పరిష్కరించుకోవడానికి, పాత ద్వేషాలతో రగిలిపోతున్నవారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. పేరుకేమో 
తెలంగాణా వాదం. కాని కూలగోట్టిందేమో తెలంగాణా తల్లి విగ్రహం. ఇంతటి నీచానికి ఒడిగట్టిన వారు తమ ప్రాంతానికి, ప్రజలకు ఏం మేలు చేస్తారు?
 
కూలింది ఏ విగ్రహమైనా అది పతనమవుతున్న సామాజిక మానవీయ విలువలకు తార్కాణం.

Sunday, February 13, 2011

తెలుగు తల్లి ఎవరా?




కేసిఆర్ యొక్క అవివేకం నానాటికి బయటపడుతూ ఉంది. తెలంగాణా ఉద్యమంలో ప్రజలచేత నానాటికి చీదరించుకో బడుతున్నాడు. సీమోళ్ళని ఆంధ్ర వాళ్ళని తిట్టి పోసాక, ఇప్పుడు తెలుగు తల్లినే తిట్టడం ప్రారంభించాడు. మాట్లాడేది తెలుగు, చదివేది తెలుగు, వ్రాసేది కూడా తెలుగే, కాని తెలుగు తల్లి మాత్రం సీమాంధ్ర వాళ్ళ కల్పన అట!


మన దేశంలో ప్రతి రాష్ట్రం ఒక విభిన్న భాషకు, సంస్కృతికి, సాహిత్యానికి నిలయం. ప్రతి నాగరికతకు చిహ్నంగా ఆరాధ్య దైవంగా ఒక మాతృమూర్తిని ఎంచుకున్నారు. తమిళనాడుకు కాని, కర్నాటకకు కాని కేరళకు గాని తమ భాషకు ప్రతిరూపంగా కళలకు ప్రతీకగా ఒక తల్లి శిలావిగ్రహం ఉంటుంది. అలాగే మనకు కూడా. ఇది తెలంగాణా అయినా, రాయలసీమ అయినా కోస్తాంధ్ర అయినా అందరికీ శతాబ్దాలుగా ఉండేదే! కెసిఆర్  చదువుకున్నపుడు కూడా 'మా తెలుగు తల్లికి మల్లెపూ దండ' పాట పాడే ఉంటాడు.


ఇప్పుడు హటాత్తుగా తన తల్లిని తల్లి కాదు అని, "మా తల్లి వేరే ఆవిడ" అని చెప్పే అంత నీచ సంస్కృతిని ఏమనాలి? ఇది తన సొంత ప్రాంతంవారు కూడా హర్షించారు. అన్నదేదో అన్నాడు కాని, రేపు, మా భాష తెలుగే కాదు, దీనికి వేరే పేరు ఉందని కూడా అంటాడు. ప్రజలను (తెలంగాణా ప్రజలను అని నొక్కి చెప్పాల్సిన పని లేదు) దాదాపు దశాబ్ద కాలంగా యేమార్చిన ఈ నేత ఎంతకైనా తెగిస్తాడు అనడంలో సందేహం లేదు. ఈ మాయల ఫకీరు మాయలో ఇంకా పడేవాళ్ళు ఉన్నారా?


నీ తల్లి!
తిట్టలేదు కెసిఆర్. 'తెలుగు తల్లి ఎవరు?' అని అడిగావు కదా. దానికి ఇదే నా సమాధానం!!!!!

Monday, October 18, 2010

తిరుపతిలో హై కోర్ట్ బెంచి ఏర్పాటయ్యేనా?

తిరుపతిలో హై కోర్ట్ బెంచి ఏర్పాటయ్యేనా?

తిరుపతిలో హై కోర్ట్ బెంచ్ ఏర్పాటు పై జరుగుతున్న ఆందోళన పన్నెండు రోజులకు చేరుకొంది. తిరుపతిలో లాయర్లు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారట. అక్టోబర్ పంతొమ్మిదిన (మంగళవారం) రాయలసీమ ప్రాంతపు లాయర్లు అందరూ చేరి ఒక పెద్ద సమావేశం జరుపుచున్నారు. దాదాపు ముప్పై ఏళ్ళుగా నలుగుతున్న సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా ఈ సమావేశం రూపుదిద్దుకుంటుంది. ఇందులో అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు మరియు కడప జిల్లాలకు చెందిన 60 బార్ అసోసియేషన్ల సభ్యులు పాల్గొంటున్నారు.

ఎక్కడో విసిరి పారేసినట్టు ఉండే ఈ సీమనుండి ప్రతి వాయిదాకు హైదరాబాదుకు వెళ్ళాలంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. పేద బతుకులు న్యాయం పొందాలన్నా ఖర్చే ! అందుకే అప్పటి హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చల్లా కొండయ్య మూడు దశాబ్దాల క్రితం తిరుపతిలో రాయలసీమ ప్రాంతంకోసం హై కోర్ట్ బెంచును ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కాని, ఇంతవరకు అది ఆచరణకు నోచుకోలేదు. ఇప్పటి వేర్పాటు ధోరణుల వల్ల జరిగే అనర్థాలు ఎన్నెన్నో. మనం మేలుకోకపోతే ఈ ఒక్క అవకాశం కూడా కోల్పోవలసి వస్తుంది.

ఇది అడ్వొకేట్లకు చెందిన సమస్యగా మాత్రమే మనం పరిగణించ కూడదు. ఇది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి సమస్య. మేలుకొందాం. తిరుపతికి అందరూ తరలి వెళ్దాం.

Tuesday, July 27, 2010

ఇదీ తెలంగాణా 'వెనుకబాట' చరిత్ర!

ఇదీ తెలంగాణా 'వెనుకబాట' చరిత్ర!

తెలంగాణా అంటేనే ఇప్పుడు యావత్ భారతదేశంలో ఒక చర్చనీయాంశం. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎవరిని కదిపినా ఆంధ్ర ప్రదేశ్లో అదో కల్లోలిత ప్రాంతం అనేంతగా ముదిరింది చర్చ. వెనుకబాటుతనానికి పర్యాయ పదంగా, వేర్పాటువాదానికి నాందిగా చెప్పుకొనే తారా స్థాయికి చేరింది ఈ చర్చ. కాని, ఈ వెనుకబాటుతనానికి పక్క ప్రాంతాల వారిని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసే నాయకులు మొత్తం సమస్యనే పక్కదోవ పట్టిస్తున్నారు అనడంలో సందేహం లేదు. తద్వారా తెలంగాణా సమస్యపై, వెనుకబాటుతనంపై అవగాహన ఉండి, సానుకూల స్పందనతో పరిష్కారానికి ముందుకు వచ్చే సీమ, ఆంధ్ర ప్రాంత మేధావులను, ప్రజా ప్రతినిధులను దూరం చేసుకుంటున్నారు. ఇది ఇతర ప్రాంత వాసులకు రుచించక పోవడమే కాదు, నొప్పి కలిగిస్తుంది కూడా.
ప్రజలకు ఉద్వేగాన్ని మాత్రమె నూరి పోసే ఇలాంటి నాయకులకు చారిత్రక వాస్తవాలు తెలియవంటే నమ్మశక్యం కాదు. నేడు సెంటిమెంటుపై ఉప ఎన్నికలు జరిగే సమయంలో 'తెలిసిన వాస్తవాలనే' తెలియనివారికీ, తెలియనట్టు నటిస్తున్నవారికి చెప్పాలని అనిపించి ఇలా బ్లాగుతున్నాను.

అసఫ్ జాహి వంశస్తుల పాలనలో నుంచీ చాలా ఏళ్ళు మగ్గిన తెలంగాణా ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో "వెనుకబాటు పాట" పాడుతోంది. దొరల అహంకారం, రజాకర్ల కరుకుదనం, చలి చీమల చేతకానితనం కలగలిసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో తోసాయి. పూట గడవడమే కష్టమన్న స్థితిలో దాదాపు ప్రతి కుగ్రామంలోను పదుల సంఖ్యలో ఇళ్లు ఉండేవి. అవసరానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నవారు ప్రతి తాలూకాకు ఓ ఇద్దరో ముగ్గురో ఉండేవారు. ఇలా సంపద సమానంగా పంచబడక ధనిక పేద వర్గాల మధ్య అంతరం పెరిగింది. కారణాలు ఏవైనా, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఒక ఖనిజ సంపద గల భూమి బీడుగా మారింది.

మరోపక్క, మద్రాసు ప్రెసిడెన్సి పాలనలో ఉన్న రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాలు బ్రిటిషువారి చేత చావుదెబ్బలు తిన్నా క్రమశిక్షణతో కూడిన అభివృద్ధిని చవిచూసాయి. రహదారులు, రైళ్ళు, గుళ్ళు, బళ్ళు, బ్యారేజిలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్ని వెలసి సుభిక్షంగా ఉన్నాయి. మొత్తానికి బాగుపడ్డాయి.
మద్యం పై నిజాం పాలనలో నిషేధం లేదు కాని, పన్ను ఉండేది. అందువల్ల, మద్యం ద్వారా ప్రభుత్వ రాబడి బాగా పెరిగింది, కాని, మధ్యసేవనంవల్ల ప్రజలు ఇంకా బక్కచిక్కి పోయారు. సరిగ్గా ఇదే సమయంలో బ్రిటిష్ పాలనలో మధ్య నిషేధం విధించి ప్రజలను మంచి మార్గంలో పెట్టి, వారి శక్తియుక్తులను సమాజ శ్రేయస్సు కొరకు వాడుకొన్నారు. ఇక్కడ అందరూ బాగుపడ్డారు.

స్వతంత్రం వచ్చే నాటికి కూడా తెలంగాణా (అంటే అప్పటి హైదరాబాద్ రాష్ట్రం) వేరుగా ఉన్నది. బ్రిటిష్ పాలనలో లేని ప్రాంతం తెల్లదొరలు విడిచి వెళ్ళే దేశంలో ఎందుకు చేరాలని బుకాయించింది, మొరాయించింది, తెగేసి వాదించింది. చివరకు దాదాపు మరో దశాబ్దం తెలంగాణా ప్రజల ఆకలి ఆర్తనాదాలు మిన్నంటుతూనే ఉన్నాయి. అప్పటికే అభివృద్ధి ఏ కోశానా కనపడలేదు. ఇంతకీ అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ తన సొంత కరెన్సీతో తన సొంత బ్యాంకునే నడిపేవాడు అన్నది కొసమెరుపు!

రాష్ట్రాల సమీకరణకు పునరేకీకరణకు సమయం ఆసన్నమైనప్పుడు హైదరాబాద్ను ఆంధ్రతో కలపాలన్న ఆలోచన తెలంగాణా సామ్రాజ్య పాలకుల్లో నైరాశ్యాన్ని నింపింది. అప్పటికే బాగా అభివృద్ధి చెందినట్టువంటి సీమ, ఆంధ్ర ప్రాంతాలను చూసి ఒక రకమైన ఆత్మ న్యూనత భావంతో తల్లడిల్లి పోయారు. ఎక్కడో పొరపాటు జరిగింది అని గ్రహించారు. కళ్ళకు గంతలు కట్టుకొని సుఖమయమైన జీవితం అనుభవించిన రాచరికపు వారసులకు, వారికి సపర్యలు చేస్తూ బతికేసిన దొరలకు ఇప్పుడు తమచే పాలింపబడ్డవారికి సంజాయిషీ ఇచ్చుకోవలసిన పరిస్థితి. అలాగే, ఈ పునరేకీకరణ ప్రక్రియ నుంచి కూడా బయటపడాలన్న దురాలోచన. వెరసి 'తెలంగాణావాదం' ఉదయించింది. అప్పటికే అంధకారంలో ఉన్న తెలంగాణా ప్రజలు వాస్తవాలు గ్రహించలేక పోయారు. దొరలు చెప్పినవే తరాలుగా విన్న వారు, ఇదికూడా 'శ్రద్ధగా' విన్నారు, వంట బట్టించుకున్నారు. వాస్తవమనుకున్నారు. తమ పేదరికానికి పాలకులు కారణం కాదన్న భావనకు వచ్చేసారు. ఇంకేం? దొరల పాచిక పారింది. ప్రజల పేరిట ఉద్యమం ప్రారంభించారు. నేటికీ వారిని మోసం చేస్తూ వారి పేరుతోనే విప్లవాలు సాగిస్తూ, వారినే సమిధలుగా చేస్తున్నారు. నేటి పరిస్థితికి వస్తే, ముక్కు పచ్చలారని పిల్లలు కూడా 'ముక్కు' వీరుల ఆక్రోశపు మాటలకు ఆకర్షితులై, ఆవేశానికిలోనై అశువులు బాస్తున్నారు. పాపం, వీరికి ఎవరు వాస్తవాలు చెప్పాలి? ఎవరు చెబితే వింటారు?

పోరాటం తప్పు కాదు. దానికి ఏ నాయకుడు అక్కర్లేదు. కాని తప్పుదోవ పట్టించిన వారిని ఇప్పటికైనా చీదరించుకుని, దిద్దుబాటు చేసుకుంటే చాలు. ప్రాంతాల అభివృద్ధి స్వయం పాలనలో కాదు, మేటి పాలనతో వస్తుంది. ఒక శతాబ్దం పాటు వెనుకబాటుకు గురయి, ఇప్పటికిప్పుడు మేలుకొని 'మేము వెనుకబడ్డాం మొర్రో, దీనికి సీమాంధ్ర వలసవాదులే కారణంరా బాబూ ' అంటే అది వాస్తవ విరుద్ధం. మెదడుకు ఎక్కదు.
ప్రజలే కోరుకుంటే స్వరాజ్యం కాదు, సురాజ్యం కూడా సులభంగా సాధించుకోవచ్చు. ఈ సిన్నోడి మాటలు జరా ఆలకించు తెలంగాణా బ్రదరూ!

Wednesday, April 21, 2010

మాయన్నీ తీస్క పోతారు... !

మాయన్నీ తీస్క పోతారు... !

ఇదీ శ్రీకృష్ణ కమిటీ ముందు మొన్నటికి మొన్న ఒక తెలంగాణా ఆడబిడ్డ సెప్పినట్టుగా ఒక ఇంగిలీసు పేపర్లో పేద్ద అక్షరాలతో వచ్చిన వార్త. ఇది ఎవరిని ఉద్దేశించి అంటారా? అదేమి పెత్యేకించి చెప్పబళ్లా. ఆంధ్ర రాయల సీమోళ్ళనేగా వాళ్ళు ఎప్పుడూ దెప్పి పొడిచేది?


ఏమి ఎత్తుకొని పోయినాము తల్లీ? నీ భూమి నీ దగ్గెడే గదా ఉంది. నీ చెట్లు మేమేమి నరుక్కొని పోలా కదా? నీ పైర్లు బాగా చూసుకో, మీ మడికాడే ఉంది. మేమేమి కోసుకొని పాయినామా?

మేమేమన్న నీకన్నా బావుండామని అనుకోన్నావేమో? ఈపక్క ఓసారి వచ్చి చూస్తే తెలుస్తాది. మీయి మాయి ఒకటే రకం బతుకులు తల్లీ! మీ ఎండే మాకు, మీ ఎండిన బాయినీళ్ళ గొడవలే మావీ.
ఎవరో మీ ఊరి సర్పంచి కాని వేరే నాయకులు కాని చెప్పినారని మమ్మల్ని శత్రువులు మాదిరి చూడబాక. అవన్నీ కడుపులో చల్లగా పడ్డాక మాట్లాడేవోళ్ళు చేసే పని. మనం ఆంధ్ర ప్రదేశ్లో ఉన్నా, లేక రేపు నువ్వు తెలంగాణాలో నేను రాయలసీమలో ఉన్నా, మన సేద్ద్యెం మనదే, మన కయ్యిలకాడ పనులు మనవే. మన పిల్లలు, ఇంట్లో ముసలోళ్ళ సంగతులు చూసుకోవడం ఎలాగో తప్పదు. ఇంకెందుకు ఈ దెబ్బలాటలు? తెలంగాణా వెనక బడలేదని నేను చెప్పలా, కానీ మా సీమ కూడా మీయంతే, ఇంకా చెప్పాలంటే మీకన్నా ఎనకబడి ఉంది. చెప్తే నమ్మవేమో. ఏంజేసేది? నువ్వు మా నేల పగుళ్ళు చూళ్ళేదు కదా? ఇంకా మా పగిలిన గుండెల సంగతులేం తెలుసుకుంటావు? వెనకబాటుతనానికి ముందు వెనుకలు ఉండవు. కాకపోతే ఓ ప్రాంతం ఎక్కువ ఎనకబడి ఇంకో ప్రాంతం తక్కువ ఎనకబడి ఉండొచ్చు.


వాస్తవాలు తెలుసుకో వేరుపడడం వాళ్ళ ఏమీ రాదని అర్థం చేసుకో చెల్లెమ్మా!

Wednesday, April 14, 2010

Seema Vaasulako Vignapthi

సీమ ప్రాంతం మారలేదు. సీమవాసుల బ్రతుకులు మారలేదు. ఆ తిరుపతి వెంకన్న ఆశీస్సులు గాని, శ్రీశైలం మల్లన్న దీవేనగాని, నెల్లూరు రంగన్నకరుణ గాని మన వ్రాతను మార్చలేక పోయాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణా వాదంతో ఎక్కువ నష్టపోయే అవకాశం మనకే ఉంది.

జనగళంతోనే ప్రభుత్వాలు దిగి వస్తాయి అన్న దృఢ చిత్తంతో ఈ బ్లాగ్ను ప్రారంభించాం. సీమ వాసుల్లారా, మేల్కోండి. మీ అక్షర ఆయుధాన్ని పదును పెట్టి మీ అభిప్రాయాలు వ్రాయండి. ఎక్కువ మందిని చేర్చి చదివించండి. మన వాణి శ్రీ కృష్ణ కమిటీకి వినిపిద్దాం. మన ప్రాంత అవసరాలు తీర్చుకుందాం.

ఇట్లు సీమ సిన్నోడు.