Saturday, March 17, 2018

అమ్మ పవనా...!

అస్సలనుకోలా, ఇట్లా అవినీతిపైన శంఖం పూరిస్తావని..!




నీ పంచ్ డైలాగులు లేవుగాని ఎమోషన్ ఏమాత్రం తగ్గకుండా మాట్లాడినావు అబ్బాయా.. నాలుగో వార్షికోత్సవం అనగానే కొంత నవ్వులూ పువ్వులూ వుంటాయనుకున్నాము గానీ, నువ్వు ఒకటే సీరియస్ బా. నోరు తెరిసినప్పుడు నుండీ దూకుడే అనుకో..

తెల్ల స్క్రీన్ ముందర నల్ల జుబ్బా వేస్కొని ఉన్నావు కాబట్టి కాస్త మసగ్గా కనిపించావు కానీ, గడ్డం గీసేసి ధగధగా మెరిసిపోయినావు అనుకో. చక్కగా మాట్లాడినావు. నీ ఆక్రోశం ఏమాత్రం తగ్గలా.  ఎన్నెన్ని విషయాలు మాట్లాడినవో ఎంతెంత లోతుగా చెప్పినావో చూస్తే, నిజంగానే నీకు ఇన్ని విషయాలు తెలుసా అని అడిగేవాళ్ళ నోరు మూయించినావనుకో.

మొదటిసారిగా లోకేషు బాబును వాయించేసినావె.  అవినీతి గురించి మాట్లాడతావని ఎదురుచూస్తున్నాము గాని నేరుగా చిన్నబ్బాయిని టార్గెట్ చేసేసినావె. ఎవురూ లేపోతే  ఏ కౌన్సిలరునో, మహా అయితే  ఎమ్మెల్యేనో, ఇంకా పోతే ఏ ఎంపీనో ఏకేస్తావని అనుకుంటుంటే అదేదో కుంభస్థలం అంటారే, అట్లా సియం కొడుకు పైన అస్త్రం ఎక్కుపెట్టినావు. కాని అవి అందరూ అంటున్న వింటున్న అనుకొంటున్న పుకార్లే కానీ బలమైన ఆధారాలతో చెప్పుంటే బాగా ఉండేది. 

అట్లా తెలుగు దేశాన్ని తెగేదాకా తిట్నావు, బాబుగారిని బండగా తిట్నావు, లోకేషును లోతుగా తిట్నావు, జగన్ని జడుసుకునేలాగా తిట్టినావు, కేంద్రాన్ని ఇంగిలీషులో తిట్నావు...   కానీ, ఏంబా అంత దూరం లాగేసినావు? తెంపేసుకుందామనేనా? నువ్వు లాగతా ఉన్నప్పుడే అర్థమయింది ఇది తెంపడానికే అని. వామపక్షాలని వొదిలినావుయోవ్.  ఈ లెక్కన చూస్తే కామ్రేడ్స్ ఇంక జెపితో మాత్రమే దోస్తీనా? ఒకటి మాత్రం అర్థంకాలేదు. ప్రజలకోసం కలిసిమెలిసి ఉండి, అవినీతి అసమర్థ పాలనను నాలుగేళ్లు ఓర్చుకొని సహనం కోల్పోయి ఇప్పుడు తిట్టినాను అంటున్నావు గాని, బయటి నుంచి, అంటే ప్రజలవైపు నుంచి  చూస్తే, మీరంతా 2014 నుండి ఒక్కటే కదా. నువ్వు చెప్పిన అవినీతి అసమర్థత నీకు కూడా వర్తిస్తుందిబా.. 



దూకుడుగా అరుపులు, అనవసరమైన చోట కులాల ప్రస్తావన, ముందు వెనుక విషయాలను ఓ కూర్పు లేకుండా మాట్లాడటం వంటివి వదిలేస్తే, నీ ప్రసంగం బేషుగ్గా సాగింది. కుర్రాళ్ళ రెస్పాన్స్ కూడా అదుర్స్ అన్నట్లు ఉంది. నువ్వు ఒప్పుకున్నా లేకున్నా పవన్ ఓటు బ్యాంకు వీళ్ళేకదా.. 

ఈ వేడి తగ్గనీకుండా ఇక్కడే ఉండి ప్రజల సమక్షంలో సమస్యల్ని చూస్తే నిన్ను సీరియస్గా  తీసుకుంటారు. హైదరాబాద్ కి వెళ్ళిపోయి నెల తర్వాత వస్తే మర్చిపోతారు.   అయినా ఇల్లు కట్టుకుంటున్నావు కదా, అది పూర్తయ్యే దాక గుంటూరు వదిలి యాడికి పోతావులే...!

Sunday, July 24, 2016

నాకు నేనే..!


 











హలాలు పట్టి పొలాలు దున్నలేము కానీ ఫలాల కోసం నోరు తెరుస్తాం 
కాలికి బురద అంటుకోనీయం కానీ చేతికి అన్నం ముద్ద కావాలంటాం 
తాత ముత్తాతలు పండించిన బియ్యపు రకాలు తెలియవు, బాస్మతి ఉంటే చాలంటాం 
గోమాత సేవ చేయం కానీ కాఫీకి చిక్కటి పాలు కావాలంటాం 

మలగోవా కాదరు బేనిషా తీపి నేనెరుగ, మాజ ఫ్రూటీ స్లైస్ తాగుతాం గా..!
కంది ఉలవ ఉద్ది శెనగ నేనెరుగ, దాల్ మఖని  మెనూ కార్డులో ఉందిగా..!! 
గోవు పొదుగు ముట్టి ఎరుగను, పాలెక్కణ్ణుంచి వస్తుందంటే కవర్లోంచి అంటాం 
కాలువేత్తే వాణ్ణి విస్మరిస్తాం, కళకళలాడే వాతావరణం కావాలంటాం 

మామిడికి పట్టే చీడ గురించి నాకేల, ప్రియా ఆవకాయ తెప్పిస్తే పోలా?
మత్స్యకారుల బతుకు పోరాటం మాకేల, ఫిష్ ఫ్రై ఓ ప్లేటు ఆర్డర్ ఇస్తే పోలా ?
కోళ్లు గొర్రెలు మేపడం మా తరం కాదు, KFCలో ఆర్డర్ ఇచ్చే తరం మాది 
పందులు మేపేవాడు ఎవడో తెలియదు, కానీ పొర్కును ఫోర్కుతో తినే తరం మాది  

పత్తి రైతు వ్యధ ఎరుగం కానీ కాటన్ చొక్కా ముడతలు పడనీయం 
పట్టు పురుగు శ్రమ ఎరుగం కానీ పోచంపల్లి బనారస్లు వదులుకోమ్
నేత కార్మికుడి మగ్గం చూసిందెవరు, చందన బొమ్మన గుమ్మమెక్కుతుంటే 
దర్జీ కుట్టు మిషను చక్రాన్ని చూడలేదు, దర్జాగా రెడీమేడ్ వేస్కుంటుంటే 

శిల్పి ఉలి శబ్దం ఎరుగం కానీ నా పోర్టికోకు అందమైన శిల్పం కావాలి 
రంగుల కుంచె ముట్టింది లేదు కానీ నా పోర్ట్రయిట్ డ్రాయింగ్ రూంలో ఉండాలి 
వడ్రంగి పనితనం నేనెరుగ, డబుల్ కాట్ బెడ్ దంరో లో కొంటాగా 
స్వర్ణకారుల నేర్పరితనం నేనెరుగ, తెలిసిందల్లా ఖజానా కళ్యాణ్ GRT ధగధగ 

ఇలా ఎన్నో ఎన్నెన్నో ఉంది ఉదాహరణలు, ఎవరో ఎవరెవరో ఉన్నారు మన జీవనగమనంలో 
మనమెవ్వరినీ పరికించం, పలకరించం, పరిశీలించం, పరీక్షగా చూడం. 
ఈ ప్రపంచంలో కోట్లాది మందిలో ఒకరికి ఒకరం పరాయివాళ్ళం 
ఈ జన సంద్రంలో మనమందరం ఒంటరివాళ్ళం 

మన చుట్టూ ఉన్న సమాజంలో మనకెవ్వరూ అక్కర్లేదు 
ఒకరిపై ఒకరు ఆధారపడి బతుకుతున్నాం అన్న భావన అస్సల్లేదు 
అందరిలో నేనే గొప్ప అనే భావన కలగడం చాలా సులభం 
కానీ ఆధారపడనిదే బతుకు బండి నడవడం దుర్లభం 

రండి, ఒకరినొకరు పలకరిద్దాం, నీ మనుగడకు సాయపడే ప్రతి ఒక్కర్నీ కలవరిద్దాం 
ఆజన్మాంతం సహాయపడే వారికి ఋణపడి ఉందాం, అదే నోటితో మనసారా ధన్యవాదములు తెలుపుదాం 
జగమంత కుటుంబం మనది అని చాటు రా 
అది ఏకాకి జీవితం కాకూడదు రా...!

Saturday, October 31, 2015

మౌనమేలనోయి...!

మౌనం అర్ధాంగీకారం
జరిగే పరిణామాలకు కొన్నిటికి ఆమోదం, కొన్నిటికి వ్యతిరేకం

మౌనం సమ్మతం
ఇలా జరగాల్సిందే, తగిన శాస్తి జరిగింది

మౌనం సహన స్వీకారం
స్పందించక ముందు ఇంకాస్త ఓపిగ్గా చూద్దాం

మౌనం నిర్వేద సూచన
ఎక్కడో ఏదో జరిగితే నేనెందుకు స్పందించాలి?

మౌనం దుఃఖ సంకేతం
ఇలా ఎందుకు జరుగుతోంది? బాధగా ఉంది!

మౌనం అచేతన రూపం
ప్చ్.. ఇలా జరగాల్సింది కాదు

మౌనం ఆగ్రహసహితం
ఇలాంటి వారిని సహించను, ఉతికారేయాలి

మౌనం కవ్వింపుకు శ్రీకారం
ఇలాగే ఉందాం. ఎవరెలా స్పందిస్తారో వేచి చూద్దాం..!

మౌనం స్థితప్రజ్ఞతకు ఆధారం
ఏదెలా జరిగినా మన మంచికే. నేను కారకుణ్ణి కాను, భాద్యుణ్ణి కాను

ఇదండీ... ఈయన మౌనాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. సిరా పోయడం, చేయి చేసుకోవడం, కర్రలతో బాదడం, ఎవరేమి తినాలో శాసించడం, ఇక డౌన్ డౌన్ల సంగతి చెప్పనవసరం లేదు... ఎందుకిలా జరుగుతోంది? స్పందన ఎందుకు కరువవుతోంది. ఇదేమి బాగాలేదని ఎవరన్నా ఆయనకి చెప్పరూ?? ఇంతకీ ఆయన ఎవరంటారా?

ఓం 'నమో' వేంకటేశాయ..!


Saturday, October 17, 2015

అమరావతి కి వందనాలు

ఏంది యోవ్!!  మొత్తం మీద రాజధానికి సిద్ధం అవతా ఉండారు అంతా.  మనోళ్ళు కూడా సంబరాలు చేసుకుంటా ఉండారు కుండలో నీళ్ళు పట్టుకుని, గోతాంలో మట్టి పోసుకొని. ఓ రెండ్రోజుల్లో మోడీ గారు వచ్చి పలక నాటి పోతే ఓ పదేళ్ళలో ఓ కొలిక్కి రావచ్చేమో కదా...!

యాడో మాగొప్ప రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ని దివాలాకోరు దిశగా తోసింది విభజన.  అన్నం పెట్టె చెయ్యిని  అడక్కతినే పరిస్థితికి తెచ్చిండ్లా. మడికాడ పక్క కయ్యి వాడు నీళ్లు ఇమ్మంటేనే కసురుకునే రోజులు, ఇంకా పక్క రాష్ట్రం వాడు ఇస్తాడా? ఏంటికి ఇస్తాడు? ముందే మనకు కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళతో పేచి ఉండాది, ఇప్పుడు ఎగదాల ఇంకో కొత్త రాష్ట్రం వచ్చింది కదా. ఇంకా అంతే సంగతులు... 

ఇంక వసతులు అంటారా, ఒక్కోటి తెచ్చుకోడానికి నానా పాట్లు పడాలి. యాభై ఏళ్ళలో తెచ్చుకున్నదంతా హైదరాబాద్ లో పెట్టించి ఎద్దులో లాభం యాడో పోయినట్లు అయింది. మళ్ళీ బొచ్చె పట్టుకొని బొచ్చు సర్దుకొని ఎలబారినారు మన రాజకీయ నాయకులు. ఏదో తెస్తారని మాత్రం అంతా బాగానే అనుకుంటా ఉండారులే. అదేదో హోదా అంట కదా... అది వస్తుందని, రాదని, రావొచ్చని, రాకపోయినా నష్టం లేదని, వస్తేనే అన్నీ అవుతుందని కాదని, ఇలా రకరకాలుగా అంతా మాట్లాడతా ఉంటె, పైనుండే పెద్ద గడ్డం ఆయన, అదేబా మోడీ గారు, నోరే తెరవడు. ఈయనేందో మన్మోహన్ సింగే  మేలు అన్నట్లుగా ఉండాదే..!

అంతా బాగానే ఉంది కాని, రాజధాని విశేషాల్ని సీమోళ్ళు మాత్రం బెరుగ్గానే చూస్తా ఉండారు. అదొస్తుంది ఇదొస్తుంది అని బాగానే ఊదరగొడతా ఉంటె వచ్చేదేందో  పోయ్యేదేందో  తెలియట్లేదు.  అమరావతి జపం కూసంత ఎక్కువైనట్లే ఉన్నా మళ్ళీ ఈ గలాటలు మొదటికే వస్తుందేమో, చూసుకోండి నాయుడు గారు...!

Saturday, August 23, 2014

విదూషక శిఖామణి..!


బఫూన్ అనే ఒక చిన్న పదం పెద్ద రాజకీయ దుమారం రేపింది. ఎందుకలాగా? 


బఫూన్ అనే స్థాయిలో ప్రభుత్వ పక్షం నడుచుకొందా? లేక బఫూన్ అని తిట్టెంత స్థాయిలో ప్రతిపక్షం ఉందా? ఇంతకీ బఫూన్ అంటే బూతా? కాదంటారు జగన్, అయినా క్షమాపణకు పట్టుబడుతోంది పాలకపక్షమ్.

బఫూన్ అంటే ప్రజలను నవ్వించే విదూషకుడు అని, ఆ మాట చెప్పిన వారే సెలవిచ్చారు. విదూషకుడు అంటే తిట్టా? కాదే. ఓ రకంగా ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తూ, వినోదాన్ని పంచుతూ వారి బాధలనుండి విముక్తి కల్గించే వాడు విదూషకుడు. సమస్యల నడుమ కొట్టుమిట్టాడుతూ ఆశల హరివిల్లు ఎక్కలేక, దరిద్రంతో దోబూచులాడుతున్న ఆమ్ ఆద్మీ కి విదూషకుడు ఓ గొప్ప నేస్తం. త్రిశంకు స్వర్గంలో ఉన్నామన్న భావనను మరిపించి, నిజమైన స్వర్గాన్ని దగ్గరలో చూపించే ఓ అద్దం.  నవ్వించి, ఆడించి, కేరింతలు కొట్టించి సామాన్య ప్రజల రోదిస్తున్న గుండెల్ని సైతం తేలేటట్టు చేసే ఓ మాయలోడు. నిజమైన చేదు వార్తను తీపి కోటింగ్ ఇచ్చి మనలో ఎక్కించే MBBS లేని వైద్యుడు.

మరి ఇంత మంచి వ్యక్తిని బూతుగా మార్చేసినారేంది సామీ. రాజకీయుల తిట్లకు వేరే పేర్లు దొరకలేదా? ఓ సినిమాలో ఓ స్వామీజీ ఆశీర్వాదం చేస్తే వాడు నాశనమై పోతాడు అని ప్రజల భయం. తను తిడితే బావుంటాడు అని నమ్మకం. అందరూ అడిగిమరీ తిట్టించుకుంటారు ఆ సామి దగ్గర. అలాంటి పరిస్థితే ఇక్కడ.

కాని, జగన్ను మెచ్చుకోవాలి. మంత్రులపై ఎంత కొపమున్నా ఓ మంచి పదంతో తిట్టాడు. (తిట్టినట్లు అనుకుంటున్నాడు). ఇదే అవకాశంగా పాలకపక్షం కూడా ఎగిరి గంతులేస్తున్నారు.  ఈ అద్భుత అవకాశం అందిపుచ్చుకున్నందుకు జగన్ కు 'విదూషక శిఖామణి' లాంటి బిరుదు ఇవ్వాలి...! 

Friday, January 17, 2014

నేనొక్కడినే... కాను!





'1.. నేనొక్కడినే' సినిమా చూడకముందు పేస్ బుక్  లో ఓ కామెంట్ చూసా . ' ఈ సినిమా చదువుకున్న వారికి మాత్రమే అర్థం అవుతుంది' అని. దానికి ప్రతి కామెంట్ ఏమంటే: 'అంటే మహేష్ సినిమా చూడాలంటే డిగ్రీ చేసి రావాలా?'

నవ్వుకోడానికి బాగానే ఉంది కాని, ఈ కామెంట్ నిజ్జంగానే విలువైనధి. తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా ఇధి. ఎదుగుతున్న సాంకేతిక విలువలకు అద్దం పడుతున్న సినిమా. హాలీవుడ్ అంటే పెద్ద సీన్ కాదని, మనం చెయ్యగలిగే స్థాయేనని నిరూపించారు డైరెక్టర్ సుకుమార్.

ఒక సైకలాజికల్ థ్రిల్లర్ తీయాలని అనుకున్నప్పుడు, ఆ సూపర్ స్టార్ యొక్క అభిమానుల గురించి, అతని చుట్టూ ఉన్న ఇమేజ్ అనే వలయం గురించి మామూలుగా అందరూ ఆలోచిస్తారు. సుకుమార్ కాని, మహేష్ కాని, ఇలాంటి చిన్న చిన్న విషయాలను దాటి ఆలోచించగలిగారంటే అది మన టాలివుడ్ కి శుభ పరిమాణం.

ఇక సినిమాకి వస్తే, ఓ వ్యక్తి ఊహా జనిత ఆలోచనలకు, అతని మానసిక అవస్థలకు అద్దం పట్టే కథ. తన తల్లి తండ్రులను ఎవరో చంపేశారని బలంగా నమ్మే వ్యక్తి వారిని చంపాలనుకుంటాడు. పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. ముక్కూ మొహం తెలియని వారిని గుర్తించడం ఎలా, చంపడం ఎలా?  తను ఊహించుకుంటున్న విషయం నిజమా, అబద్ధమా అని కూడా పదే పదే అడిగి తెలుసుకునేంత కన్ఫ్యూస్ అయిన వ్యక్తి మన హీరో. తను అబద్ధం అని రాజి పడి సర్దుకునే సమయంలో తన గతానికి సంబంధించిన విషయాలు నిజాలుగా తేలుతాయి. తన గతం గురించి తెలుసుకునే ప్రయత్నం ముమ్మరం చేస్తాడు. గోవా వెళ్తాడు, ఐర్లాండ్ పోతాడు, విల్లన్లను పట్టుకుని చంపేస్తాడు. తల్లితండ్రుల గురించి తెలుసుకుని, వాళ్ళ ఆశయాలను కాపాడుతాడు. కథ ఎంత క్లిష్టమైనదో, కథనం అంత వైవిధ్యం. నగిషీలు దిద్ది దర్శకులు తీర్చి దిద్దిన విధం అద్భుతం.

ఒక్కటే విషయం. చందమామ కథల నుండి, యక్ష ప్రశ్నల వరకు, అన్నిట్నీ అందరికీ అర్థం అయ్యే విధంగా ఒకే సారి చెప్పడం చాల కష్టం. ఒక్కొక్కరి గ్రాహక శక్తీ ఒక్కో విధంగా ఉంటుంది. మరి సుకుమార్ ప్రయత్నం ఓ మేధావి వర్గాన్ని మాత్రమే ఆకట్టుకోవడానికే అనుకుంటే ఎలా? డివైడెడ్ టాక్ నుంచి బావుంది అనే మాట రావడానికి కేవలం రెండు రోజులే పట్టింది. సో, సినిమా నచ్చింది అని చెప్పేవాడిని నేనొక్కడినే కానేమో?  మొత్తానికి, ఈ సినిమా అర్థం కాలేదంటే నేను మేధావిని కానేమో అని ప్రేక్షకులు భయపడైనా ఒప్పెసుకునేట్టు ఉంది..!

సుకుమార్ కి, మహేష్ కి మాత్రమే కాక, నిర్మాతలకు కూడా ఈ కీర్తిలో భాగం ఉంది. ధైర్యం ప్రదర్శించి నిర్మాతలు కూడా శభాష్ అనిపించుకొన్నారు.  'తెలుగులో మంచి సినిమాలు రావు' అని పొరుగు రాష్ట్రాలను కీర్తిస్తూ మనోళ్ళను దెప్పిపొడిచే ఓ సామాన్య ప్రేక్షకుడా, దృక్పధం మార్చుకొని మరోసారి సినిమా చూడు.


మూసలను పగులకొడదాం. కొత్త ప్రయత్నాన్ని స్వాగతిద్దాం..! 

Tuesday, April 16, 2013

రవాణా రాష్ట్రం... రావణ కాష్టం...!


రవాణా రాష్ట్రం... రావణ కాష్టం...!

వేగం పుంజుకున్నది, మార్గం సుగమమైనది, రాష్ట్రంలో అందరూ ఏదో ఒక బాట పట్టారు.

ధర్మం ఎన్ని కాళ్ళపై నడుస్తుందో కాని, ప్రతి ఒక్కరు ఎక్కడో నడుస్తూనే ఉన్నారు. మండుటెండలు రోడ్డు పైనున్న తారును కరిగిస్తుంటే, మాయదారి మాటలతో మన నాయకులు రోడ్డెక్కి ప్రజల మనసులను కరిగించే పనిలో పడ్డారు. 




'మీకోసమే' అంటూ బాబన్న పాదయాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయి దాటింది. చెల్లెమ్మ నడక ఊరూరా సాగి, రాజన్న రాజ్యాన్ని కాంక్షిస్తున్నది. కిరణ్ బాబు 'ఇందిరమ్మ కలలను' సాకారం చేయడానికి ప్రతి జిల్లాలోనూ మారుమూల దళితవాడను ఎంచుకొని పరుగులు సాగిస్తున్నాడు. తెలంగాణా రాష్ట్ర సమితి వారు బస్సు యాత్ర చేపట్టాలనుకుంటే, ఆ ప్రాంతానికే చెందిన కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కారు ఎక్కేదానికి సిద్ధపడ్డారు.  కమ్యునిస్టులు, పరివార్ మిత్రులు అరుదుగా కలిసి ప్రభుత్వాన్ని కలిసి వ్యతిరేకిస్తున్నారు, విద్యుత్ చార్జీల విషయమై రోడ్డెక్కారు.










ఏది ఏమైనా, విస్మయం కలిగే రీతిలో అన్ని పార్టీల నాయకులు చంచల్ గూడ దారి పట్టారు, తృణమో పణమో 'జన నాయకునికి' ముట్ట చెప్పడానికి, గుట్టు చప్పుడు కాకుండా రవాణా చేస్తూ.




నడక మంచిదని ప్రతి ఒక్కరూ అంటారు. డాక్టర్లు సలహా ఇచ్చేది కూడా ఇదే. ఇదేమి గోలో కాని, అందరు నాయకుల డాక్టర్లు ఒక్కసారిగా ఇలా సలహా పడేసినట్లున్నారు. అంతా నడక మయం.  కాని ఇంట్లో గడవక, లైట్లు మండక, చేలో మోటర్లు నడవక, నింగినంటిన ధరలకు నిత్యావసర వస్తువులు కొనలేక, పిల్లలను చదివించుకోలేక సామాన్యుడు మాత్రం ఎటూపాలుపోక దిక్కు తోచని స్థితిలో నడుస్తూనే ఉన్నాడు. చావును వెతుక్కుంటూ. కాని ఈ నడక మన మాధ్యమాలకు అవసరం లేని నడక. అందుకే ఇది ఏ పేపర్లోనూ, ఏ చానేల్లోను కనపడదు.

'నడుస్తున్నది' రవాణా రాష్ట్రమా, లేక రావణ కాష్టమా?