బఫూన్ అనే ఒక చిన్న పదం పెద్ద రాజకీయ దుమారం రేపింది. ఎందుకలాగా?
బఫూన్ అనే స్థాయిలో ప్రభుత్వ పక్షం నడుచుకొందా? లేక బఫూన్ అని తిట్టెంత స్థాయిలో ప్రతిపక్షం ఉందా? ఇంతకీ బఫూన్ అంటే బూతా? కాదంటారు జగన్, అయినా క్షమాపణకు పట్టుబడుతోంది పాలకపక్షమ్.
బఫూన్ అంటే ప్రజలను నవ్వించే విదూషకుడు అని, ఆ మాట చెప్పిన వారే సెలవిచ్చారు. విదూషకుడు అంటే తిట్టా? కాదే. ఓ రకంగా ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తూ, వినోదాన్ని పంచుతూ వారి బాధలనుండి విముక్తి కల్గించే వాడు విదూషకుడు. సమస్యల నడుమ కొట్టుమిట్టాడుతూ ఆశల హరివిల్లు ఎక్కలేక, దరిద్రంతో దోబూచులాడుతున్న ఆమ్ ఆద్మీ కి విదూషకుడు ఓ గొప్ప నేస్తం. త్రిశంకు స్వర్గంలో ఉన్నామన్న భావనను మరిపించి, నిజమైన స్వర్గాన్ని దగ్గరలో చూపించే ఓ అద్దం. నవ్వించి, ఆడించి, కేరింతలు కొట్టించి సామాన్య ప్రజల రోదిస్తున్న గుండెల్ని సైతం తేలేటట్టు చేసే ఓ మాయలోడు. నిజమైన చేదు వార్తను తీపి కోటింగ్ ఇచ్చి మనలో ఎక్కించే MBBS లేని వైద్యుడు.
మరి ఇంత మంచి వ్యక్తిని బూతుగా మార్చేసినారేంది సామీ. రాజకీయుల తిట్లకు వేరే పేర్లు దొరకలేదా? ఓ సినిమాలో ఓ స్వామీజీ ఆశీర్వాదం చేస్తే వాడు నాశనమై పోతాడు అని ప్రజల భయం. తను తిడితే బావుంటాడు అని నమ్మకం. అందరూ అడిగిమరీ తిట్టించుకుంటారు ఆ సామి దగ్గర. అలాంటి పరిస్థితే ఇక్కడ.
కాని, జగన్ను మెచ్చుకోవాలి. మంత్రులపై ఎంత కొపమున్నా ఓ మంచి పదంతో తిట్టాడు. (తిట్టినట్లు అనుకుంటున్నాడు). ఇదే అవకాశంగా పాలకపక్షం కూడా ఎగిరి గంతులేస్తున్నారు. ఈ అద్భుత అవకాశం అందిపుచ్చుకున్నందుకు జగన్ కు 'విదూషక శిఖామణి' లాంటి బిరుదు ఇవ్వాలి...!
'1.. నేనొక్కడినే' సినిమా చూడకముందు పేస్ బుక్ లో ఓ కామెంట్ చూసా . ' ఈ సినిమా చదువుకున్న వారికి మాత్రమే అర్థం అవుతుంది' అని. దానికి ప్రతి కామెంట్ ఏమంటే: 'అంటే మహేష్ సినిమా చూడాలంటే డిగ్రీ చేసి రావాలా?'
నవ్వుకోడానికి బాగానే ఉంది కాని, ఈ కామెంట్ నిజ్జంగానే విలువైనధి. తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా ఇధి. ఎదుగుతున్న సాంకేతిక విలువలకు అద్దం పడుతున్న సినిమా. హాలీవుడ్ అంటే పెద్ద సీన్ కాదని, మనం చెయ్యగలిగే స్థాయేనని నిరూపించారు డైరెక్టర్ సుకుమార్.
ఒక సైకలాజికల్ థ్రిల్లర్ తీయాలని అనుకున్నప్పుడు, ఆ సూపర్ స్టార్ యొక్క అభిమానుల గురించి, అతని చుట్టూ ఉన్న ఇమేజ్ అనే వలయం గురించి మామూలుగా అందరూ ఆలోచిస్తారు. సుకుమార్ కాని, మహేష్ కాని, ఇలాంటి చిన్న చిన్న విషయాలను దాటి ఆలోచించగలిగారంటే అది మన టాలివుడ్ కి శుభ పరిమాణం.
ఇక సినిమాకి వస్తే, ఓ వ్యక్తి ఊహా జనిత ఆలోచనలకు, అతని మానసిక అవస్థలకు అద్దం పట్టే కథ. తన తల్లి తండ్రులను ఎవరో చంపేశారని బలంగా నమ్మే వ్యక్తి వారిని చంపాలనుకుంటాడు. పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. ముక్కూ మొహం తెలియని వారిని గుర్తించడం ఎలా, చంపడం ఎలా? తను ఊహించుకుంటున్న విషయం నిజమా, అబద్ధమా అని కూడా పదే పదే అడిగి తెలుసుకునేంత కన్ఫ్యూస్ అయిన వ్యక్తి మన హీరో. తను అబద్ధం అని రాజి పడి సర్దుకునే సమయంలో తన గతానికి సంబంధించిన విషయాలు నిజాలుగా తేలుతాయి. తన గతం గురించి తెలుసుకునే ప్రయత్నం ముమ్మరం చేస్తాడు. గోవా వెళ్తాడు, ఐర్లాండ్ పోతాడు, విల్లన్లను పట్టుకుని చంపేస్తాడు. తల్లితండ్రుల గురించి తెలుసుకుని, వాళ్ళ ఆశయాలను కాపాడుతాడు. కథ ఎంత క్లిష్టమైనదో, కథనం అంత వైవిధ్యం. నగిషీలు దిద్ది దర్శకులు తీర్చి దిద్దిన విధం అద్భుతం.
ఒక్కటే విషయం. చందమామ కథల నుండి, యక్ష ప్రశ్నల వరకు, అన్నిట్నీ అందరికీ అర్థం అయ్యే విధంగా ఒకే సారి చెప్పడం చాల కష్టం. ఒక్కొక్కరి గ్రాహక శక్తీ ఒక్కో విధంగా ఉంటుంది. మరి సుకుమార్ ప్రయత్నం ఓ మేధావి వర్గాన్ని మాత్రమే ఆకట్టుకోవడానికే అనుకుంటే ఎలా? డివైడెడ్ టాక్ నుంచి బావుంది అనే మాట రావడానికి కేవలం రెండు రోజులే పట్టింది. సో, సినిమా నచ్చింది అని చెప్పేవాడిని నేనొక్కడినే కానేమో? మొత్తానికి, ఈ సినిమా అర్థం కాలేదంటే నేను మేధావిని కానేమో అని ప్రేక్షకులు భయపడైనా ఒప్పెసుకునేట్టు ఉంది..!
సుకుమార్ కి, మహేష్ కి మాత్రమే కాక, నిర్మాతలకు కూడా ఈ కీర్తిలో భాగం ఉంది. ధైర్యం ప్రదర్శించి నిర్మాతలు కూడా శభాష్ అనిపించుకొన్నారు. 'తెలుగులో మంచి సినిమాలు రావు' అని పొరుగు రాష్ట్రాలను కీర్తిస్తూ మనోళ్ళను దెప్పిపొడిచే ఓ సామాన్య ప్రేక్షకుడా, దృక్పధం మార్చుకొని మరోసారి సినిమా చూడు.
మూసలను పగులకొడదాం. కొత్త ప్రయత్నాన్ని స్వాగతిద్దాం..!